· · · ·

The Govt. of Telangana signs an MoU with MEIL

MEIL

ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం దావోస్ లో జరుగుతోన్న వరల్డ్ ఎకనమిక్ ఫోరం (World Economic Forum)లో మరో దిగ్గజ సంస్థ మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ (Megha Engineering and Infrastructure Limited -MEIL) తో సుమారు రూ. 15 వేల కోట్ల విలువైన మూడు కీలక ఒప్పందాలు కుదుర్చుకుంది.

దావోస్ వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ సదస్సులో తెలంగాణ పెవీలియన్ లో గౌరవ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారి సమక్షంలో ఉన్నతాధికారులు, మెఘా ఇంజనీరింగ్ ఇన్ఫ్రాస్టక్చర్ లిమిటెడ్ (MEIL) ఎండీ పీవీ కృష్ణారెడ్డి గారు ఒప్పందాలపై సంతకాలు చేశారు.

1) రాష్ట్రంలో 2160 మెగావాట్ల పంప్డ్ స్టోరేజ్ ఇంధన ఉత్పత్తి ప్రాజెక్ట్ ఏర్పాటు కోసం పరస్పర అవగాహన ఒప్పందం (ఎంవోయూ) పై సంతకాలు జరిగాయి. ఈ ప్రాజెక్టుపై దాదాపు రూ.11 వేల కోట్లు పెట్టుబడులు పెట్టనుంది.
నిర్మాణ దశలో దాదాపు వెయ్యి మందికి ఉద్యోగాలు లభించనున్నాయి. కార్యకలాపాలు ప్రారంభించిన తర్వాత అదనంగా మరో 250 మందికి ఉద్యోగాలు లభిస్తాయి. అవసరమైన ఉద్యోగుల నియామకాలకు కంపెనీ క్యాంపస్ రిక్రూట్మెంట్ డ్రైవ్ కూడా నిర్వహిస్తుంది.

ఈ చర్చల సందర్భంగా మేఘా ఇంజనీరింగ్ సంస్థ ఎండీ కృష్ణారెడ్డి గారు మాట్లాడుతూ, తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీ 2025 లక్ష్య సాధనలో పాలుపంచుకునేందుకు ఈ ప్రాజెక్టు చేపట్టినట్లు తెలిపారు.

2) దీంతో పాటు మెఘా కంపెనీ బ్యాటరీ ఎనర్జీ స్టోరేజీ సిస్టమ్ ప్రాజెక్టు ఏర్పాటు చేసేందుకు మరో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. తెలంగాణ అంతటా అత్యాధునిక బ్యాటరీ ఎనర్జీ సిస్టమ్ ప్రాజెక్టును స్థాపించేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో ఎంవోయూపై సంతకాలు చేశాయి.

రాష్ట్రంలో ఎంపిక చేసిన ప్రదేశాలలో100 ఎంవీహెచ్ల బ్యాటరీ ఎనర్జీ స్టోరేజీ వ్యవస్థను ఈ కంపెనీ అభివృద్ధి చేస్తుంది. దీనికి రూ.3000 కోట్ల పెట్టుబడులకు ముందుకొచ్చింది. దీంతో రెండేండ్లలో 1000 మందికి ప్రతక్ష్య ఉద్యోగాలు, 3000 మందికి పరోక్షంగా ఉపాధి లభిస్తుంది. ఇంధన నిల్వ, గ్రిడ్ స్థిరత్వం, పీక్ లోడ్ నిర్వహణలో ఈ ప్రాజెక్టు కీలక పాత్ర పోషిస్తుంది.

3) మెఘా కంపెనీ పర్యాటక రంగంలోనూ పెట్టుబడులకు ముందుకొచ్చింది. అనంతగిరిలో వరల్డ్ క్లాస్ లగ్జరీ వెల్నెస్ రిసార్ట్ ఏర్పాటు కు చేసేందుకు మెఘా కంపెనీ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది.

హైదరాబాద్ కు చెందిన మౌలిక సదుపాయాల సంస్థ భాగస్వామ్యంతో ఈ రిసార్ట్ ను అభివృద్ధి చేసేందుకు రూ.1000 కోట్ల పెట్టుబడి పెడుతుంది. ఈ ప్రాజెక్టు నిర్మాణ దశలోనే దాదాపు రెండు వేల మందికి ఉద్యోగాలు కల్పిస్తుంది.